Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పండుగ పూట ప్రజలకు ఊరట.. కూల్చివేతలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

Telangana High Court interim orders on demolitions provide relief to people during festival
Advertisement
  • దసరా సెలవుల్లో కూల్చివేతలకు పాల్పడవద్దన్న హైకోర్టు 
  • ప్రభుత్వ, ప్రైవేట్ వ్యక్తుల మధ్య వివాదంలో ఉన్న భూములకు వర్తింపు
  • అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచన
  • ఖమ్మం జిల్లా మహిళ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఉత్తర్వులు
  • అక్టోబర్ 25 వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని స్పష్టీకరణ
Advertisement
దసరా పండుగ సెలవుల నేపథ్యంలో తెలంగాణలో ఎటువంటి కూల్చివేతలు చేపట్టవద్దని, ఆస్తులను ఖాళీ చేయించే చర్యలకు దిగవద్దని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 17 నుంచి 25వ తేదీ వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వం, ప్రైవేట్ వ్యక్తుల మధ్య వివాదంలో ఉన్న భూములు, ఆస్తుల విషయంలో ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది.

ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)కి తగిన ఆదేశాలు జారీ చేయాలని రెవెన్యూ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే, వివాదాస్పద ఆస్తుల విషయంలో ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థలు చట్టప్రకారం నోటీసులు జారీ చేసేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని కోర్టు స్పష్టం చేసింది.

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం చింతగూడెం గ్రామానికి చెందిన శీలం లీలావతి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్.వి. శ్రావణ కుమార్ ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. సర్వే నెం. 71/4లో ఉన్న తన 1.20 ఎకరాల భూమిలోని పశువుల పాకను ఖాళీ చేయించేందుకు అధికారులు యత్నిస్తున్నారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కోర్టు, సదరు ఆస్తి విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

అదే సమయంలో, పండుగ సెలవుల కాలంలోనూ రెవెన్యూ అధికారులు ఇటువంటి కూల్చివేతలకు పాల్పడుతున్నారని బార్ అసోసియేషన్ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా వర్తించేలా విస్తృత ఆదేశాలు జారీ చేసింది.
Advertisement
Advertisement
Telangana High Court
HYDRA demolitions
Dussehra festival relief
Telangana land eviction stay
Justice NV Shravan Kumar
Hyderabad Disaster Response Agency

More Telugu News